ప్రస్తుతం ఇప్పటి మార్కెట్లో తేనెకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థమని అందరూ ఉపయోగిస్తున్న ఈ తేనెకు కల్తీ ముప్పు పెరుగుతూనే ఉంది. స్వచ్చమైన తేనె ధర ఎక్కువ కావడంతో కొందరు వ్యాపారులు చక్కెర సిరప్, గ్లూకోజ్, కార్న్ సిరప్, స్టార్చ్ వంటి పదార్థాలను కలిపి తేనెగా అమ్ముతున్నారు. దీని వల్ల వినియోగదారులు మోసపోతున్నారు మాత్రమే కాకుండా, శరీరానికి హాని కలిగే అవకాశం కూడా ఉంది. అందుకే ఇంట్లోనే తేనె నిజమో, కల్తీదో గుర్తించే కొన్ని సరళమైన పద్ధతులను పాటించడం చాలా అవసరం.
స్వచ్చమైన తేనె లక్షణాలు..
స్వచ్చమైన తేనె సహజంగా మందంగా ఉంటుంది. నీటిలో వేసినప్పుడు సులభంగా కలవదు. తేనెకు సహజమైన మాధుర్యం ఉంటుంది కానీ చక్కెర లాంటి అధిక తీపి ఉండదు. వాసన కూడా స్వచ్ఛంగా, పూల పరిమళంలా ఉంటుంది. నిజమైన తేనె ఎక్కువకాలం నిల్వ ఉంచినా పాడవదు, కేవలం సాంద్రత కొంచెం మారుతుంది కానీ రుచి, నాణ్యత చెడిపోదు.
కల్తీ తేనె లక్షణాలు..
కల్తీ తేనెను ఎక్కువగా చక్కెర లేదా సిరప్ కలిపి తయారు చేస్తారు కాబట్టి అది నీటిలో వేస్తే వెంటనే కలిసిపోతుంది. దీన్ని రుచి చూస్తే అధికంగా తీపి, కొన్నిసార్లు అసహజంగా ఉంటుంది. కొంతకాలానికి గడ్డకట్టడం లేదా స్ఫటికాలు ఏర్పడటం కనిపిస్తుంది.
తేనేను ఇంట్లోనే గుర్తించే పద్ధతులు..
నీటి పరీక్ష – ఒక గ్లాస్ నీటిలో తేనె వేసి చూడండి. స్వచ్చమైన తేనె బిందువులా కింద కూర్చుంటుంది. కానీ కల్తీ తేనె నీటిలో కలిసిపోతుంది.
అగ్ని పరీక్ష – పత్తి బుట్టను తేనెలో ముంచి వెలిగించండి. స్వచ్చమైన తేనె ఉంటే అది సులభంగా మంట పడుతుంది. కానీ నీరు లేదా ఇతర పదార్థాలు కలిపి ఉంటే వెలగదు.
వేలి పరీక్ష – కొద్దిగా తేనె వేళ్లపై వేసి చూడండి. స్వచ్ఛమైన తేనె వేళ్ల మీదే అంటుకుని ఉంటుంది, చుట్టుపక్కల చిందదు. కానీ కల్తీ తేనె నీటిలా జారిపోతుంది.
పేపర్ పరీక్ష – ఒక కాగితంపై కొద్దిగా తేనె వేసి చూడండి. అది ఆరిపోకుండా అదే చోట ముద్దలా ఉంటుంది. కల్తీ తేనె అయితే కాగితం తడిసిపోతుంది.
తేనే కోనే వినియోగదారులకు సూచనలు..
తేనె కొనేటప్పుడు విశ్వసనీయమైన బ్రాండ్‌లను లేదా స్థానికంగా తేనె సేకరించే వారికి చెందిన ఉత్పత్తులను మాత్రమే కొనడం మంచిది. ప్యాకేజింగ్, లేబుల్స్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. తక్కువ ధరకు ఎక్కువ తేనె ఇస్తున్నారని మోసపోవద్దు.