నగరంలో భారీ వర్షాలు.. నీటమునిగిన MGBS బస్టాండ్

తెలంగాణలో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా శుక్రవారం కొన్ని గంటలపాటు కురిసిన వర్షంతో రహదారులు చెరువుల్లా మారిపోయాయి. ఈ నేపథ్యంలో అబిడ్స్, కోటీ, కాచిగూడ, నల్లగుట్ట, రసూల్ పుర వంటి ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరి వాహనదారులు, సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులను గురిచేసింది. అదేవిధంగా రాష్ట్రంలో అతిపెద్ద బస్టాండ్ అయిన ఎంజీబీఎస్ (మహాత్మా గాంధీ బస్ స్టేషన్) బస్టాండ్ పూర్తిగా నీటమునిగింది.

దేశంలోని అతిపెద్ద బస్ స్టేషన్లలో ఒకటైన ఎంజీబీఎస్‌లో వర్షం కారణంగా మోకాళ్ల వరకు నీరు నిల్వ కావడంతో ప్రయాణికులు బస్సుల వరకు చేరడానికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులు బస్టాండ్ లోపలికి రాకపోవడంతో బయట రోడ్లపై బారులు తీరాయి. వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు స్తంభించిపోవడంతో ఆందోళనకు గురయ్యారు. రిక్షాలు, ఆటోలు కూడా దొరకక ప్రజలు ఇరుక్కుపోయారు.

తాజాగా బస్టాండ్ మునగడం పై ఎంజీబీఎస్ అధికారి సుఖేందర్ రెడ్డి స్పందించారు. వ‌ర‌ద ప్ర‌వాహం దృష్ట్యా బ‌స్సుల‌ను ఎంజీబీఎస్ లోప‌లికి అనుమ‌తించ‌డం లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను తాత్కాలికంగా మ‌ళ్లించామ‌ని తెలిపారు. ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, మిర్యాల‌గూడ నుంచి వ‌చ్చే బ‌స్సులు దిల్‌సుఖ్‌న‌గ‌ర్ వ‌ర‌కు, క‌ర్నూల్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి వ‌చ్చే బ‌స్సుల‌ను ఆరాంఘ‌ర్ వ‌ద్ద మ‌ళ్లిస్తున్నారు. వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ నుంచి వ‌చ్చే బ‌స్సులు ఉప్ప‌ల్ వ‌ర‌కే అనుమ‌తిస్తున్నారు. ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్, నిజామాబాద్ నుంచి వ‌చ్చే బ‌స్సుల‌ను జేబీఎస్ వ‌ర‌కు అనుమ‌తిస్తున్నారు. రిజ‌ర్వేష‌న్ చేసుకున్న ప్ర‌యాణికుల పికప్ పాయింట్ల‌ను మార్చామ‌ని సుఖేంద‌ర్ రెడ్డి తెలిపారు.