పెండింగ్లో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఆర్థిక సహాయం విడుదల చేయాలి
షాద్నగర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్ యాదవ్
రంగారెడ్డి జిల్లా బ్యూరో, ఆగస్ట్ 17 (జర్నలిస్ట్ డైరీ) :
పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని, హైకోర్టులో ఉన్న స్టే వెంటనే ఎత్తివేయాలని, పెండింగ్లో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఆర్థిక సహాయం విడుదల చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో షాద్నగర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవోను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలు లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచాయని అన్నారు. ఇలాంటి పథకాలను నిలిపివేయడం పేద ఆడబిడ్డలకు అన్యాయం చేయడమేనని పేర్కొన్నారు. ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉన్న సమయంలో ప్రభుత్వం సకాలంలో కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో, పేదల ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశంపై ప్రభుత్వం ఎందుకు సమర్థవంతంగా వాదించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ పథకాలను నిలిపివేయాలని చూడటం సరికాదన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీని అమలు చేయకపోగా ఉన్న కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలను కూడా నిలిపివేయాలని చూడటం పేద ప్రజలను మోసం చేయడమేనని రవీందర్ యాదవ్ విమర్శించారు. పెండింగ్లో ఉన్న ప్రతి అర్హుడికి వెంటనే ఆర్థిక సహాయం విడుదల చేయాలని, తులం బంగారం హామీని ఎప్పుడు అమలు చేస్తారో ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పేద ఆడబిడ్డల ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి నిర్ణయాన్నైనా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, అవసరమైతే ప్రజల తరఫున మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని రవీందర్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, నరేందర్, మాజీ మహిళా శిశు సంక్షేమ ప్రాంతీయ సమన్వయకర్త రాజ్యలక్ష్మి, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాల్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ పీఏసీఎస్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ గ్రంథాలయ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వివిధ మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ యువత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.