కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. 25 మంది సజీవదహనం !

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో శుక్రవారం (అక్టోబర్ 24, 2025) తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ స్లీపర్ బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మందికి పైగా ప్రయాణికులు సజీవదహనమై మృతి చెందారు. మరో 12 మంది స్వల్ప గాయాలతో తప్పించుకుని చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటన గురువారం (అక్టోబర్ 23) రాత్రి 10:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు (రిజిస్ట్రేషన్: DD01N9490, వోల్వో మోడల్) శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలోని జాతీయ రహదారి-44 (NH-44)పై ప్రమాదానికి గురైంది. అయితే ఈ బస్సు ఎదురుగా వస్తున్న పల్సర్ బైకును ఢీకొట్టింది. బైకు బస్సు కింద ఇరుక్కుపోయి సుమారు 300 మీటర్లు ఈడ్చుకెళ్లబడింది. దీంతో బైకు లేదా బస్సు ఆయిల్ ట్యాంక్ పగిలిపోయి ఆయిల్ లీక్ అవుతూ మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి పూర్తిగా దగ్ధం అయ్యాయి.
అదే విధంగా భారీ వర్షం కురుస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. బస్సులోని చాలా మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో త్వరగా బయటకు రాలేకపోయారు. అత్యవసర ద్వారం (Emergency door) ద్వారా 12 మంది తప్పించుకున్నారు, కానీ మిగిలినవారు బస్సులోనే చిక్కుకుని సజీవదహనమయ్యారు.

ప్రస్తుతం ప్రాథమికంగా 19 మంది మృతదేహలను గుర్తించిన అధికారులు. తర్వాత ఫోరెన్సిక్ బృందం 19 మృతదేహాలు వెలికితీసింది. మొత్తం 20-25 మంది మృతి చెందినట్లు అధికారులు అంచనా. బస్సులో 40 మంది ప్రయాణికులు (డ్రైవర్, సహాయక సిబ్బందితో సహా) ఉన్నారు. 12 మంది స్వల్ప గాయాలతో కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (GGH)లో చికిత్స పొందుతున్నారు. వీరిలో హిందూపూర్‌కు చెందిన నవీన్, రమిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం వంటి వారు ఉన్నారు. ఒక దంపతి, ఇద్దరు చిన్నారులు కూడా మృతి చెందారు. 19 మంది మృతులను గుర్తించారు. మిగిలినవారి గుర్తింపు కోసం DNA టెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బస్సు ఎక్కినవారిలో రామ్‌రెడ్డి, ధాత్రి, అమిత్ కుమార్, హర్ష, సబ్రహ్మణ్యం, సత్యనారాయణ, వేణు వంటి వారి ఫోన్లు స్విచ్ ఆఫ్‌లా ఉన్నాయి.

కాగా అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది త్వరగా చేరి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్, సహాయక డ్రైవర్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి ఆదేశాల మేరకు కర్నూలు, హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలు కర్నూలు కలెక్టరేట్‌కు (08518-235000) లేదా హైదరాబాద్ కలెక్టరేట్‌కు (040-23454321) సంప్రదించవచ్చని తెలిపారు.