రాత్రికి తీరం దాటనున్న మొంథా!

మొంథా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంత వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర రూపం దాల్చింది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 120 కిమీ, కాకినాడకి 200 కిమీ, విశాఖపట్నంకి 290 కిమీ దూరంలో కేంద్రీకృతం అయ్యింది. ఈరోజు రాత్రికి కాకినాడ- మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం చూపనుందని హెచ్చరించారు. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు ఉండనున్నాయి. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలన్నారు.

తుఫాను ప్రభావంతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌పై కూడా ప్రభావం పడింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, తిరుపతి, హైదరాబాద్, కడప, విశాఖపట్నం నుంచి రోజూ 21 విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తం 16 విమాన సర్వీసులు రద్దు చేశారు. 9 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. షార్జా, బెంగళూరు, హైదరాబాద్, విశాఖ సర్వీసులను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఢిల్లీ, ముంబై సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేశాయి. తుఫాను నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి ప్రకటించారు.

తెలంగాణపై కూడా మొంథా తుఫాను ప్రభావం చూపుతోంది. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. నేడు తెలంగాణలోని 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు నాలుగు జిల్లాలకు ఆరెంజ్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ప్రభుత్వం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగా మోహరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. తుఫాను తీరం దాటిన తర్వాత త్వరగా బలహీనపడుతుందని అధికారులు తెలిపారు. మరో 12 నుంచి 18 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు హెచ్చరికలు పాటించి, సురక్షితంగా ఉండాలన్నారు.