అయోధ్య: సనాతన ధర్మంలో ఆలయ ధ్వజం చాలా పవిత్రమైనది, దానికి గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉంది. “ధ్వజం వినా దేవాలయం న సంపూర్ణం” అంటారు. ధ్వజం లేకుండా ఆలయ ప్రతిష్ఠ పరిపూర్ణం కాదు. ఎంత పెద్ద ఆలయమైనా శిఖరంపై ధ్వజం లేకపోతే అది పూర్తి కాలేదని, దేవుడు పూర్తిగా ప్రతిష్ఠింపబడలేదని శాస్త్రాలు చెబుతున్నాయి. గాలికి ధ్వజం ఎగురుతూ ఉంటే… అక్కడ దేవుని శక్తి ఉందని అర్థం. ఆ శక్తి భక్తులకు ఆశీస్సులు ఇస్తూ, దుష్టశక్తులను దూరం చేస్తుందని సనాతన ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. ఆలయ ధ్వజం కేవలం గుర్తు మాత్రమే కాదు, దైవం యొక్క జీవచ్ఛక్తికి ప్రతీక.
ఇక అయోధ్య భవ్య రామమందిర నిర్మాణంలో అత్యంత ప్రాధాన్యమున్న ఘట్టం ధ్వజారోహణం ఈ నెల 25న జరగనుంది. ఈ పరమ పవిత్ర కార్యక్రమాన్ని మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించనున్నారు. రామపంచమి సందర్భంగా 11:58 గంటల నుంచి ఒంటి గంట మధ్య అయోధ్య రామ మందిరం ప్రధాన గర్భగుడి శిఖరంపై ఘనమైన ధ్వజం ఆవిష్కరణ జరగనుంది. ఈ సందర్భంగా రామ మందిర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ జెండా కుంకుమ రంగులో ఉంటుందని, మధ్యలో ‘ఓం’ చిహ్నం, సూర్య బింబం, కొవిధార వృక్షం చిత్రంతో ప్రత్యేకంగా తయారు చేశారని ప్రకటనలో పేర్కొన్నారు. మందిర గర్భగుడి శిఖరం 161 అడుగుల ఎత్తు కాగా, దాని పైన మరో 30 అడుగుల దండం (ఫ్లాగ్ పోల్) ఏర్పాటు చేశారు. అంటే ఈ ధ్వజం భూమి నుంచి 191 అడుగుల ఎత్తులో ఉండనుంది. ధ్వజం అనేది దేవుని సాన్నిధ్యం, శక్తి, రక్షణకు చిహ్నం. జెండా రెపరెపలాడితే అక్కడ దైవిక శక్తి సజీవంగా ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ధ్వజం ఆవిష్కరణను అత్యంత పవిత్రమైన, మహోన్నతమైన కార్యక్రమంగా భావిస్తారు. ఈ జెండా అయోధ్య పరంపర, సూర్యవంశం, రామాయణ ఆధ్యాత్మిక ప్రతీకలతో ముడిపడి ఉండటం విశేషం. లక్షలాది భక్తులు ఈ చారిత్రక క్షణానికి సాక్ష్యంగా నిలవనున్నారు.