హాలియా SBIలో భారీ అగ్ని ప్రమాదం..

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో హాలియా మండలం సమీపంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని స్థానికుల్లో భయాన్ని కలిగించింది. గత రాత్రి బ్యాంక్ భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. భవనం పూర్తిగా మంటలకు ఆహుతమైంది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు లేదా మరణించలేదని అధికారులు నిర్ధారించారు. అయితే, బ్యాంకులో ఉంచిన కీలక ఫైళ్ళు, డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయి.

భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు..


పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా హాలియా సమీపంలోని ఎస్‌బీఐలో అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా దట్టంగా మంటలు.. పొగ రావడాన్ని గమనించిన స్థానిక మిల్క్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు ఆ అపార్ట్‌మెంట్‌ పైన నివసిస్తున్న వాళ్లను అప్రమత్తం చేశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఘటన వెంటనే ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

కంప్యూటర్ షట్ డౌన్ చేయకపోవడంతో షార్ట్ సర్క్యూట్..


అయితే ఈ ఘటనలో కంప్యూటర్లు, ఫర్నీచర్‌, ఇతర సామాగ్రి బూడిద మొత్తం అయ్యాయి. బ్యాంక్‌లో తాకట్టు పెట్టిన ష్యూరిటీ పత్రాలు, నగదు పరిస్థితి ఏంటన్నది తేలియాల్సి ఉంది. అయితే.. ఈ ఘటనకు కారణం బ్యాంకు సిబ్బంది ఓ కంప్యూటర్ షట్ డౌన్ చేయకుండా వదిలేశారు. ఆ కంప్యూటర్‌ వద్దే రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు రాజుకున్నాయి. అలా.. ఒక్కసారిగా మంటలు బ్యాంకు మొత్తం వ్యాపించాయి.