కోట్ల విజయభాస్కర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం

కోట్ల విజయభాస్కర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం కోట్ల విజయభాస్కర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం
కోట్ల విజయభాస్కర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి జయంతి సందర్భంగా షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి దేశానికి, రాష్ట్రానికి అందించిన సేవలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొనియాడారు.
కాంగ్రెస్‌ పార్టీకి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి అందించిన సేవలు, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి, పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పట్ల నిబద్ధతతో పనిచేసిన కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలను, ప్రజాసేవను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని వీర్లపల్లి శంకర్ అన్నారు. కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజల సంక్షేమం కోసం ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫరూక్ నగర్ మండల సింగిల్ విండో వైస్ చైర్మన్ తుపాకుల శేఖర్ ముదిరాజ్, అప్పారెడ్డి గూడ మాజీ ఉపసర్పంచ్ సీతారాం, నాని తదితరులు పాల్గొన్నారు.