అతడే ఒక సైన్యం.. నేడు కొమురం భీమ్ జయంతి!

కొమురం భీం .. ఈ పేరు వింటే ఆదివాసీల గుండెలు ఉప్పొంగుతాయి. కొండాకోనల్లో విప్లవజ్వాలలు ఎగసిపడతాయి. ఆ పేరు ఓ ధైర్యం. ఆ పేరు ఓ శాసనం. ఆ పేరు వెనక గుండెనెత్తురులు మండే చైతన్యం దాగుంది. నిజాం దుర్మార్గాలపై ఉద్యమించిన గళం ఉంది. జల్, జంగిల్, జమీన్ అంటూ హోరెత్తిన నినాదం ఉంది. అతడే ఒక సైన్యం. అతడే ఒక స్ఫూర్తి కిరణం. తన జాతి కోసం పోరాడిన యోధుడు కొమురం భీమ్. అడవి తల్లిని నమ్ముకున్న తమపై నిజాం ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సమరం సాగించిన ధీరుడు. గెరిల్లా శైలిలో యుద్ధం చేశాడు. ఆ స్ఫూర్తితోనే హక్కుల పోరాటాలు సాగుతున్నాయి. ఉద్యమ జెండాలు ఎగురుతున్నాయి. గిరిజనుల హక్కుల కోసం తపించిన కొమురం భీమ్ జయంతి నేడు. 1901వ సంవత్సరం… ఆదిలాబాద్ అడవుల్లోని సంకేపల్లి గ్రామంలో గోండు తెగకు చెందిన కొమురం చిన్నూ, సోంబాయి దంపతులకు కొమురం భీమ్ జన్మించాడు. అడవి తల్లి ఒడిలో పెరిగిన భీమ్, చిన్న వయసులోనే జీవితంలోని కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. పదిహేనేళ్ల వయసులో అటవీ శాఖ సిబ్బంది దాడిలో తండ్రిని కోల్పోయాడు. ఈ ఘటన భీమ్ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. కుటుంబంతో కలిసి కరిమెర సర్ధాపూర్‌కు వలస వెళ్లిన భీమ్, అక్కడ ఆదివాసీలపై నిజాం ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను కళ్లారా చూశాడు. అడవి ఆదివాసీల జీవనాధారం. కానీ, నిజాం నవాబులు ఆ జీవనాధారంపైనే కన్నేశారు. పశువుల కాపర్లపై సుంకాలు విధించారు. భూములను లాక్కున్నారు. ఆదివాసీలను అణచివేశారు. ఈ అన్యాయాలను సహించలేని కొమురం భీమ్, నిజాం అధికారాలను తోసిపుచ్చాడు. “జల్, జంగల్, జమీన్” అనే నినాదంతో ఆదివాసీలను సమీకరించాడు. గెరిల్లా యుద్ధ శైలిలో నిజాం సైనికులపై పోరాడాడు. అడవులను తన కోటగా మార్చుకుని, ఆయుధాలతో సమరం సాగించాడు. అతడి పోరాటం కేవలం ఆదివాసీల హక్కుల కోసమే కాదు, స్వాతంత్య్రం కోసం జరిగిన సమరం. కానీ, ఈ ధీరోదాత్త పోరాటం కొమురం భీమ్ వీరమరణంతో ముగిసింది. 1940లో నిజాం సైనికులతో జరిగిన ఒక యుద్ధంలో కొమురం భీమ్ అమరుడయ్యాడు. అతడి రక్తం అడవి మట్టిలో కలిసినా, అతడి నినాదం, అతడి స్ఫూర్తి ఆదివాసీ గుండెల్లో ఇప్పటికీ జీవించి ఉంది. ఇవాళ్టికి కూడా గిరిజన ఉద్యమాలకు ఊపిరిగా నిలుస్తోంది.

కొమురం భీమ్ ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక ఉద్యమం. అతడు ఆదివాసీలకు స్వాభిమానాన్ని నేర్పిన గురువు. కొమురం భీమ్ కేవలం ఒక చరిత్ర కాదు, చరిత్రను తిరగరాసిన యోధుడు. అతడి పోరాటం మనకో పాఠం. మన్యం మట్టిలో అతడి రక్తం ఇంకినా, అతడి స్ఫూర్తి ఆదివాసీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంది. కొమురం భీమ్ జయంతి సందర్భంగా, అతడి త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తు చేసుకుంటూ జైతెలంగాణ.