సెప్టెంబర్ 16లోగా అభ్యంతరాలు, మార్పులకు దరఖాస్తులు చేసుకోవాలి
షాద్‌నగర్: 84-షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల అధికారులు షాద్‌నగర్ రెవెన్యూ డివిజనల్ అధికారిని ఎన్ఆర్ సరిత విడుదల చేశారు. ఓటర్ల జాబితా నమోదు చట్టం, 1960 నిబంధనల ప్రకారం రూపొందించిన ఈ ముసాయిదా జాబితా ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
కోతూర్, నందిగామ, కొందుర్గ్, చౌదరిగూడ, కేశంపేట, ఫరూఖ్‌నగర్ మండలాల ఏఈఆర్ఓ, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు షాద్‌నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో కార్యాలయ వేళల్లో ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించవచ్చని పేర్కొన్నారు. 2026 అక్టోబర్ 1వ తేదీని అర్హత తేదీగా పరిగణించి ఓటరు జాబితా రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ముసాయిదా జాబితాలో పేరు చేర్చడం, తొలగింపుపై అభ్యంతరాలు, ఓటరు వివరాల్లో మార్పులు, సవరణలు అవసరమైతే సెప్టెంబర్ 16వ తేదీలోగా నిర్ణీత నమూనాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. పేరు చేర్పు కోసం ఫారం-6, సంబంధిత అభ్యంతరాలు, తొలగింపుల కోసం ఫారం-7, వివరాల సవరణలు, చిరునామా మార్పుల కోసం ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ప్రజలు తమ పేర్లు, చిరునామా, వయస్సు, ఇతర వివరాలను ముసాయిదా ఓటరు జాబితాలో పరిశీలించుకుని తప్పులు ఉంటే నిర్ణీత గడువులో సరిచేసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే 2026లో ఏప్రిల్ 1, జూలై 1 లేదా అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకునే అర్హత కలిగిన యువత ముందస్తుగా ఫారం-6 ద్వారా ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు 84-షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి, షాద్‌నగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో నోటీసు జారీ చేశారు. నోటీసు తేదీ 2026 ఆగస్టు 17గా పేర్కొన్నారు.