సామాజిక న్యాయం పాటించిన మొట్టమొదటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

సామాజిక న్యాయం పాటించిన మొట్టమొదటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక న్యాయం పాటించిన మొట్టమొదటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
సామాజిక న్యాయం పాటించిన మొట్టమొదటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

కులమత భేదాలు లేకుండా ప్రజలందర్నీ సమానంగా చూసిన మహా మనిషి!

సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడిన యోధుడు!!

అణగారిన వర్గాల కోసం ఆయుధం ఎత్తిన ధీరుడు!!!

తెలంగాణ నెల గర్వించే అమర వీరుడు, బహుజన చక్రవర్తి !!!!

బహుజన తొలి రాజ్యాధికార పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సామాన్యుడిగా జన్మించి ఆధిపత్య కులాల అధికారాన్ని, బానిసత్వాన్ని ధిక్కరించి దళిత, బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపిన తొలి బహుజన చక్రవర్తి పాపన్న. పాపన్న తెలంగాణలో అనేక కోటలను నిర్మించి ఢిల్లీ సుల్తానులను, మొగలులను ఎదిరించారు. ఎంత పోరాడినా చివరకు మొగలుల సైన్యానికి సర్వాయి పాపన్న తలదించక తప్పలేదు. 17వ శతాబ్దానికి చెందిన బహుజన చక్రవర్తి గా చరిత్ర పుటల్లోకి ఎక్కిన పాపన్న జయంతి సందర్భంగా ఆయన యాదిలో……

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ధూళిమిట్ట శాసనం ప్రకారం ఆగష్టు 18, 1650 నాడు పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా, రఘనాథపల్లి మండలం, ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు నాసగోని ధర్మన్న గౌడ్. చుట్టు పక్కల గ్రామస్తులు గౌరవంతో ధర్మన్న దొర అనేవారు. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. సర్వమ్మ అతడి తల్లి. అందరు అతన్ని పాపన్న గౌడ్ అని పాపన్న దొర అన్ని పిలిచేవారు. పాపన్న ఎల్లమ్మ కు పరమ భక్తుడు. అతను శివున్ని కూడా ఆరాధించేవాడు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు.

బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్ధితులు గమనించేవాడు. తల్లి సర్వమ్మకు ఒక్క కొడుకు కావడంతో గారాబంగా పెంచింది. పాపన్న వంశం శైవమతస్థులై (శివభక్తులు) (గౌడు కులం వారు అందరు కూడ) నిత్యం పూజలు సంప్రదాయాలను తరాలుగా వస్తున్న సంప్రదాయా జీవితాన్ని యుక్త వయసు వచ్చే నాటికి క్రమక్రమంగా వ్యతిరేకించాడు. ఇతర కులాల వారితో తిరిగేవాడు. వీరిలో చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీరు సాహేబ్ పాపన్న ప్రధాన అనుచరులు. తల్లి సర్వమ్మ కోరికతో తాటిచెట్లు ఎక్కి కల్లు గీయడం కులం పని చేయడం చేసేవాడు.

హైదరాబాద్ తురుష్క ఆగడాలు :

పదహారవ శతాబ్దంలో బహమనీ సుల్తానేట్ ఐదు చిన్న రాజ్యాలుగా విడిపోయింది. గోల్కొండ కుతుబ్ షాహి రాజవంశం నియంత్రణలోకి వచ్చింది. వారు పాలించటానికి చాలా తేలికైన ప్రాంతాన్ని వారసత్వంగా పొందారు. ముస్లిం సైనికులు భూమి పన్నుల వసూలు విధానంతో ప్రజలను చాలా హింసాత్మకంగా ఇబ్బందులకు గురిచేస్తూ, పీడించి, రకరకాల పేర్లతో శిస్తులు వసూలు చేసేవారు. కులాల, మతలా పేర్లతో కూడా శిస్తులు వసూలు చేసేవారు. అలాగే గౌడ కులం వారికి తాటిచెట్లకు పన్ను వేసారు. ముస్లిం సైనికులు శిస్తులు వసూలు చేసుకొని వెళ్ళేదారిలో పాపన్న కల్లు అమ్ముకొనే మండువాలో తురుష్క సైనికులు కల్లు తాగి డబ్బులు ఇవ్వకుండా హేళనగా నవ్వుకుంటు వెళ్ళేవారు. రెండు, మూడు సార్లు అలాగే జరిగింది. డబ్బులు ఇవ్వకున్నా, పాపన్న పెద్దగా పట్టించుకునే వాడు కాదు. తురుష్క సైనికులు నా వద్ద కల్లు తాగుచున్నారు‌. రాజు గారి సైనికులు అంటే చాల గౌరవనీయులు. అయినా సైనికులు రాజుగారికి శిస్తుల లెక్కలు అప్పగించాలి కదా, కల్లుకు డబ్బులు ఇచ్చిన లెక్క తగ్గును కద పొనీలే అనుకునేవాడు. ఒకరోజు సైనికులు పాపన్న వద్ద కల్లు తాగి వెళ్లిపోవుటకు సిద్దం అవుచుండగా, కల్లు మండువాకు వస్తున పాపన్న స్నేహితుడు ఒకరు “ధనరాసులు ఉన్నా కల్లు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేద తురుష్క సైనికులు వెళ్లిపోవుటకు సిద్దం అయ్యారా” అని సరసంగా అన్నాడు.

అందుకు తురుష్క సైనికుల్లో ఒకడు కోపంతో పాపన్న స్నేహితున్ని తన్నుటకు కాలు ఎత్తాడు. అది చూసి ఆ క్షణంలో కోపోద్రిక్తుడైన పాపన్న, తన వద్ద కల్లు గీయడానికి ఉపయోగించు గీత కత్తి, మారు కత్తిలో ఒకదానితో, ప్రాణ స్నేహితుణ్ణి తన్నుటకు కాలు ఎత్తిన సైనికుడి మెడ నరికాడు. దాంతో మిగాతా సైనికులు పాపన్న మీదికి యుద్దానికి రావడంతో, ఎంతో బలవంతుడైన పాపన్న వారిని కూడా అంతమొందించాడు. ఇక అక్కడ మిగిలింది పాపన్న ప్రాణ స్నేహితులు, సైనికుల గుర్రాలు, వసూలు చేసిన రాజుగారి ధనరాసులు మాత్రమే. పేదవారిని పీడించి వసూలు చేసిన డబ్బులు వారికే ఉపయోగపడాలి అంటు పాపన్న స్నేహితులతో గుర్రాలతో, డబ్బులతో ఇంటికి చేరాడు. తురుష్క రాజ్యంలో విప్లవకారుడు అయ్యాడు.

అప్పటి నుండి తురుష్క సైనికులు శిస్తులు వసూలు చేసుకొని వెళ్ళేదారిలో, పాపన్న అతని స్నేహితులతో కలసి తిరుగుబాట్లు ప్రారంభించాడు. అలా మొదలైన తిరుగుబాటుతో ఆయుధాలు, గుర్రాలు, డబ్బులు కూడా సమకూర్చుకున్నాడు. యుద్దవిద్యలు నేర్చుకున్నాడు. పేదవారికి డబ్బులు సహాయం చేయడంతో పాపన్న పేరు జనగాం ప్రదేశంలో మారుమోగింది. గ్రామాల్లోని యువకులు పాపన్న వద్ద సైనికులుగా చేరారు. వారికి యుద్దవిద్యలు నేర్పించి, అతి తొందరలోనే 3,000 మందిని సొంతంగా సైనికులుగా సమక్చూకున్నాడు.

తెలంగాణాలో మెుఘల్ రాజు అప్పటి పాలకుల, అంతకంతకు పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యాన్ని అంతం చెయ్యాలని, తాబేదారులు, జమీనుదారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని, ధనంకాని, అధికారం కాని లేవు. గెరిల్ల సైన్యాన్ని తయారు చేసి, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యం పై దాడి చేసి, తన సొంత ఊరు ఖిలాషాపూర్ ని రాజధానిగా చేసుకొని, 1675 లో సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు. అతని తరపున పోరాడటానికి గెరిల్ల సైన్యాన్ని పెద్ద సంఖ్యలో ప్రజల సహకారంతో సమకూర్చుకున్నాడు.

పాపన్న తెలంగాణాలో ముస్లింల పాలన అంతానికి శక్తి వంచన లేకుండా పోరాడారు. 1687 – 1724 వరకు అప్పటి మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు. పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు నిర్మించాడు. 1678 వరకు తాటికొండ, వేముల కొండలను తన ఆధీనంలోకి తెచ్చుకొని దుర్గాలను నిర్మించాడు.

ఒక సామాన్య వ్యక్తి శతృదుర్భేద్యమైన కోటలను వశపర్చుకోవడం అతని వ్యూహానికి నిదర్శనం. సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి దాదాపు 20 కోటలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అతని ఆలోచనలకు బెంబేలెత్తిన భూస్వాములు, మొగలాయి తొత్తులైన నిజాములు, కుట్రలు పన్ని సైన్యాన్ని బలహీనపర్చారు. 1700 – 1705 మధ్యకాలంలో ఖిలాషాపురంలో మరొక దుర్గం నిర్మించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ దాదాపు 12 వేల సైనికులను సమకూర్చుకొని ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కొండ కోటను స్వాధీనపర్చుకొని ఏడు నెలలపాటు అధికారం నిర్వహించాడు. తెలంగాణలో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నే. అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీంనగర్ జిల్లా లోని హుస్నాబాద్, హుజూరాబాద్ వరకు విస్తరించింది. పాపన్న ముస్లిం మతానికి చెందిన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె భువనగిరి కోట ఫౌజ్దార్ (మిలిటరీ గవర్నర్) సోదరి. భువనగిరి కోటను రాజధానిగా చేసుకొని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు. జానపద కళాకారులు తరతరాలుగా 3, 4 వందల ఏండ్లు గడిచినా, జానపద కథలలో పాపన్న చరిత్ర ఇప్పటికీ స్థానికంగా పాడతారు. జానపద, భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేసిన సందర్భంలోనే చాలా సాక్ష్యాలు సేకరించబడ్డాయి. పాపన్న ఒక సాధారణ గౌడ కుటుంబం నుండి వచ్చిన వాడు కనుక అతనికి ప్రజల కష్టనష్టాలన్నీ తెలుసు. అందుకే పాపన్న రాజ్యంలో పన్నులు లేవు. ఖజానా కొరకు అతను జమిందార్, సుబేదార్లపై తన గెరిల్ల సైన్యంతో దాడి చేయించేవాడు. పాపన్న అనేక ప్రజామోద యోగ్యమైన పనులు చేసాడు. అతని రాజ్యంలో సామజిక న్యాయం పాటించేవాడు. తాటి కొండలో చెక్ డాం నిర్మించాడు. అతను ఎల్లమ్మకు పరమ భక్తుడు కావున హుజురాబాద్ లో ఎల్లమ్మ గుడి కట్టించాడు. అది రూపం మారినా నేటికీ అలానే ఉంది.

మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ కుతుబ్ షాహి సుల్తాన్ నుండి ఖచ్చితమైన ఆదేశాలు ప్రారంభించాడు. అతని కుమారుడు ఔరంగజేబును గోల్కొండలో ప్రాతినిధ్యం వహించడానికి పంపాడు. ఔరంగజేబు చివరికి 1687 లో ఈ ప్రాంతంపై పూర్తి నియంత్రణ సాధించాడు. పాపన్న గెరిల్ల సైన్యంతో మొగల్ సైన్యం పై దాడి చేస్తున్నాడని ఔరంగజేబుకు తెలిసింది. అతడు రుస్తుం దిల్ ఖాన్ కు బాధ్యతలు అప్పగించాడు. రుస్తుం దిల్ ఖాన్ యుద్ధానికి ఖాసింఖాన్ ను పంపించాడు. షాపూర్ వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి. నెలలపాటు యుద్ధం జరిగింది. చివరికి రుస్తుం దిల్ ఖాన్ రంగం లోకి దిగాడు. సుమారు మూడు నెలలపాటు యుద్ధం జరిగింది. పాపన్న తన ప్రాణ స్నేహితున్ని కోల్పోయాడు. దాంతో ఆయన యుద్ధాన్ని విరమించుకొని, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మొగల్ సైన్యాలు అతని కోసం వెతకడం ప్రారంభించాయి. అయితే పాపన్న తన సొంత ఊరు జనగామకు వెళ్లి అక్కడ గౌడ కులం వారు ఎక్కువగా ఉండే చోట జీవితం గడిపాడు. 1707లో ఔరంగజేబు మరణించిన తరువాత గోల్కొండలో సింహాసనన్ని అధిష్టించాడు. కొత్తగా రాజు అయిన తర్వాత దక్కన్ పాలకుడు కంబక్ష్ ఖాన్ బలహీన పాలనను చూసిన పాపన్న 1708 ఏప్రిల్ 1 లో వరంగల్ కోటపై దాడి చేసాడు. అయితే ఈ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు. శత్రువు చేతిలో చావడం ఇష్టం లేని పాపన్న తన బాకుతోనే గుండెల్లో పొడుచుకొని చనిపోయాడు. పాపన్న తలని గోల్కొండ కోట ముఖద్వారానికి వేళ్ళాడ దీసారు.

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లండన్ లో ఉన్న కేంబ్రిడ్జ్ యునివర్సిటీ పాపన్న మహారాజ్ చరిత్ర పై అధ్యయం చేయించి పుస్తకాలను ముద్రించింది. సర్ధార్ పాపన్న ముఖ చిత్రంతో కేంబ్రిడ్జ్ యునివర్సిటీ రెండు పుస్తకాలలో (ది న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ది సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్) చరిత్రను ముద్రించింది. బ్రిటిష్ ప్రభుత్వం లండన్ లోని “విక్టోరియా అండ్ ఆల్బర్ట్” మ్యూజియంలో సర్ధార్ పాపన్న మహారాజ్ శాశ్వత శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.

సర్వాయి పాపన్న జయంతి ఆగస్టు 18న, వర్ధంతిని ఏప్రిల్‌ 2న అధికారికంగా నిర్వహించాలని 2022 అక్టోబరు 30న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బహుజ వీరుడి చరిత్రను నేటి తరాలకు స్ఫూర్తిని అందించే విధంగా ప్రతీ ఒక్కరూ పాటుపడాలి. పాపన్న కలలు కన్న బహుజన రాజ్యాధికారం , సామాజిక న్యాయం కోసం నిరంతరం పాటుపడటమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి.